అక్షర క్రమంలో సంగీత పదాల పర్యాయ పదములు
- అలంకారము: సౌందర్యమును, అందమునిచ్చు స్వరముల గుంపు. సప్త తాళముల యొక్క స్వర శిక్షనాలంకారములు, సప్త తాళములే కాక వాటి 35 తాళముల అలంకారములు.
- అంగము :
- తాళములోని ఒక భాగమునకు, అనగా లఘువో, దృతమో దేనినైనను అంగమున వచ్చును.
- తాళ దశ ప్రానములలో నొకటి.
- సంగీత రచనలో ఏ భాగములకైననూ అంగమని పేరు. పల్లవి ఒక అంగము. ఇదే రీతిగా ఇతరములు
- అంతర గాంథారము: గాంధారము సప్తస్వరములలో మూడవ స్వరము. అంతర గాంధారము గాంధార వికృతి భేదములలో రెండవది. దీనినే హిందూస్థానీ సంగీతములో తీవ్ర గాంధార మందురు.
- అంశము : జీవస్వరమనియు రాగ చ్ఛాయస్వరమనియు కూడ వాడుట కలదు. అంగ స్వరమనగా ఒక రాగము యొక్క సంపూర్ణ రూపము ఏ స్వరము యొక్క తరచు వాడుక వల్ల వెల్లడింపబడుచున్నదో ఆ స్వరము అంశ స్వరమనబడుచున్నవి. అంతర గాంధారము శహాన రాగమునకు అంశము.
- అంతర మార్గ : రాగమునకు చెందని స్వరమును వాడుట.
- అక్షర కాలము : ఒక హ్రస్వాక్షరము పాడునంత కాల పరిమితి.
- అనుదృతము : షడంగములో నొకటి; క్రియ ---ఒక ఘాతము, విసరు; విలువ రెండక్షరముల కాలము.
- అనుమంద్రస్థాయి : మంద్ర స్థాయికి క్రింది స్థాయి; దీనిని సంకేతములో స్వరము క్రింద రెండు చుక్కలతో చూపబడుచున్నది.
- అనుపల్లవి : సంగీత రచనలలో రెండవ భాగము. పల్లవి అయిన వెంటనే అనుపల్లవి.
- అనువాది : పరిచారక స్వరము, సంవాది స్వరము కంటె హీనమైన స్వరము.
- అనాగత గ్రహము : గ్రహములలో నొకతి; సంగీతము కంటే తాలము మొదట నడచు గ్రహము.
- అవరోహణము : కొన్ని స్వరములు పై నుండి క్రిందికి దిగినట్లుండుటను అవరోహణమందురు. స ని ద ప మ గ రి స .
- అవరోహి : సంగీతమున ప్రకటించుటకు నాలుగు రకములున్నవి. ఆ నాలుగు భాగములలో అవరోహి ఒకటి. అవి; స్థాయి,ఆరోహి,అవరోహి,సంచారి.
- అన్యస్వరము : భాషాంగ రాగములోని వ్యక్తి స్వరము.
- ఆట తాళము : సప్త తాళములలో ఆరవ తాళము. అంగములు రెండు లఘువులు, రెండు దృతములు. ౹ ౹ ౦ ౦
- అతితారస్థాయి : తారస్థాయికి పైస్థాయి. ఈ స్థాయి స్వరము పై భాగమున రెండు చుక్కలతో చూపబడు చున్నది.
- అధమ వాగ్గేయకారుడు : ఒక వాగ్గేయ కారుని రచన మెట్టుకు తన స్వంత సాహిత్యమును కూర్చి రచించు వాగ్గేయకారుడు.
- అగ్ని : 72 వ మేళకర్త రాగ స్కీం లో మూడవ చక్రము.
- అపన్యాస : త్రయోదశ లక్షణములలో ఒకటి.
- అతీత గ్రహము : గ్రహములలో నొకటి. తాళము సంగీతమున కంటే మొదట నడుచు గ్రహము.
- అల్పత్వ : ఒక రాగములోని ఏ స్వరము చాల కొద్ది సార్లు ఉపయోగపడుచున్నదో ఆ స్వరమునకు అల్ప స్వరమని పేరు.
- ఆదితాళము : త్రిపుట తాళము యొక్క భేదతాళము. లఘువు చతురస్ర జాతి అయినపుడు ఆ త్రిపుట తాళమునకు ఆదితాలమని పేరు. ౹4 ౦౦= 4+2+2 = 8 అక్షరాల విలువ.
- ఆదిగురు : సంగీతమును క్రమముగా నేర్చుటకు రచనలను రచించి మనకందజేసి సంగీతమును ప్రబలుటకు పునాదియైన పురందరదాసు ల వారు.
- ఆదిత్య : 72 మేళకర్త స్కీంలో 12 వ చక్రము.
- ఆధార షడ్జమము : కృతి గా తీసికొనిన షడ్జమము.
- ఆరోహణము : కొన్ని స్వరములు ఆరోహింపు, లేక పైకి ఎక్కు పద్ధతి లో ఉండుట. రి గ మ ప ద స.
- ఆరోహి : కొన్ని ఆరోహణ క్రమ సంచారములు.
- ఆలాపన : రాగమును ప్రవృద్ధి చేయు కళకు ఆలాపన మని పేరు. దీనినే హిందుస్థానీ సంగీత పాఠకులు, "ఆలావ్" అందురు.
- ఆక్షీప్తిక : రాగము ఆలాపించుటకు కొన్ని నిబంధనలున్నవి. వాటిలో ఆక్షప్తిక మొదటిది. అనగా పాడబోవు రాగము యొక్క స్వరూపమును సంక్షేపముగా వినువారలకు తెలియబరచు దానిని ఆక్షిప్తిక అని పేరు.
- ఇందు : 72 మేళకర్త స్కీం లోమొదటి చక్రము పేరు.
- ఇంటర్వెల్ : రెండు స్వరముల మధ్యనుండు రేషియో.
- ఉపాంగ రాగము : మేళకర్త రాగ స్వరములనే కలిగి యుండు జన్య రాగము.
- ఉభయ వక్ర రాగము : ఆరోహణమును, అవరోహణమునూ వక్రములు గా నుండు జన్య రాగము.
- ఉభయ వర్జ రాగము : ఆరోహనములోనూ, అవరోహణములోనూ వర్జములుగా నుండు రాగము.
- ఉదయ : ఖండ జాతి మఠ్య తాళము యొక్క పేరు. విలువ ౹5 ౦ ౹5 =5+2+5 = 12 అక్షర కాలములు.
- ఉదీర్ణ : మిశ్ర జాతి మఠ్య తాలము యొక్క పేరు. విలువ ౹7 ౦ ౹7 =7+2+7 = 16 అక్షర కాలములు.
- ఉత్తమ వాగ్గేయకారుడు : స్వర భాగమును, సాహిత్య భాగమును స్వంతముగా రచించు వాగ్గేయకారుడు.
- ఉచ్ఛస్థాయి : తార స్థాయి యొక్క మరియొక పేరు.
- ఉత్తరాంగము : సప్తస్వరములలో పంచమము నుండి పై స్వరములు. అనగా ప ద ని స ; మరియు వర్ణము యొక్క రెండవ భాగము అనగా చరణము, చరణ స్వరములు.
- ఉత్తర మేళకర్త రాగములు : వీటిని ఉత్తర మేళములు అనికూడా అందురు. 72 మేళకర్త రాగముల స్కీములో రెండవ భాగము. ప్రతి మధ్యమ రాగములు.
- ఉపాంగ రాగములు : రాగాంగ లక్షణ గీతములో, ఆయా రాగాంగ రాగముల నుండి పుట్టిన ఉపాంగ రాగముల పట్టికను తెలుపు రెండవ భాగము.
- ఊపు : గమకములో నొకవిధ గమకము.ఒక స్వరమును ఊపుట. దీనిని (~~~~ ) సంకేతముతో చూపబడును.
- ఋషి : 72 మేళకర్త రాగ స్కీములో 7 వ చక్రము యొక్క పేరు.
- ఋతు : 72 మేళకర్త రాగ స్కీములో ఆరవ చక్రము యొక్క పేరు.
- ఎత్తుగడ పల్లవి ( ఎత్తుగడ స్వరములు) : వర్ణములో ఉత్తర భాగమున, చరణము, చరణ స్వరములకు, ఎత్తుగడ పల్లవి, ఎత్తుగడ స్వరములని పేరు.
- ఎడుప్పు : గ్రహమునకు ఇంకొక పేరు. సమ ఎడుప్పు, అనాగత ఎడుప్పు , అతీత ఎడుప్పులు అను మూడు రకములు కలవు.
- ఏక తాళము : సప్త తాళములలో ఆఖరు తాళము. అంగ సంజ్ఞ 1; అంగములు ఒక్క లఘువు మాత్రమే.
- ఏకస్వర చక్రరాగము : ఆరోహణలోగాని, అవరోహణలో కాని, లేక రెండు యందు గాని ఒక్క స్వరము వక్రముగా ఉండిన దానిని ఏకస్వర చక్రరాగమందురు.
- ఏకస్వర వర్జరాగము : షాడవ రాగమున కింకొక పేరు.
- ఏకస్వర భాషాంగ రాగము: ఒక్క అన్య స్వరము గల భాషాంగ రాగమునకు ఏకస్వర భాషాంగ రాగమని పేరు. ఉదా: భైరవి.
- ఔడవ : ఐదు స్వరములు ఆరోహణము నందు, ఐదు స్వరములు అవరోహణమునందు గల రాగము; త్రయోదక లక్షణములలో నొకటి (5 స్వరముల ప్రయోగం)
- ఔడవ - సంపూర్ణరాగము : ఆరోహణము నందు 5 స్వరములు, అవరోహణమునందు సప్త స్వరములు గల రాగము. ఆరభి, బిలహరి.
- ఔడవ షాడవ రాగము : ఆరోహణమునందు 5 స్వరములు, అవరోహణమునందు 5 స్వరములు గల రాగము. మలహరి.
- ఔడవ - స్వరాంతరము : ఆరోహణము నందు 5 స్వరములు, అవరోహణమునందు 4 స్వరములు
- కటపయాది సంఖ్య : 72 మేళకర్త రాగ స్కీంలో మేళకర్త రాగము యొక్క సీరియల్ నెంబరు కనుగొనుటకు ఉపయోగించు విధానము.
- కనకాంగి : 72 మేళకర్త రాగములలో మొదటి మేళకర్త రాగము.
- కల్యాణి : 72 మేళకర్త రాగములలో 65 వ మేళకర్త రాగము.
- కైసికి నిషాదము : నిషాద విభేదములలో మొదటి నిషాదము; ఫ్రీక్వెన్సీ 9/5 . దీనినే ఆంగ్ల సంగీతములో B(flat) అందురు.
- కాకలి నిషాదము : నిషాద విభేదములలో రెండవ నిషాదము. ఫ్రీక్వెన్సీ 15/8. దీనినే ఆంగ్ల సంగీతములో B(Sharp) అందురు.
- కాకపాదము :షడంగములలో ఒక అంగము. దినిని ఒక ఘాతము, పథకము, కృష్య, సర్పిణీలతో క్రియ చేయవలయును. సంకేతములో + తో చూపబడును. ఒక్కొక్క క్రియ విలువ నాలుగక్షరకాలములు కనుక కాకపాదము యొక్క విలువ 16 అక్షర కాలములు.
- కృష్య :చేతిని ఎడమ ప్రక్కకు విసరుటను కృష్య అనిపేరు. షడంగములలో కొన్ని అంగములలో ఉపయోగించు క్రియ.
- కదంబ : త్రిశ్ర జాతి ఝంపె తాళము యొక్క పేరు. ౹3 υ ౦ = 3+1+2=6 అక్షర కాలములు.
- కర : సంకీర్ణ జాతి ఝంపె తాళము యొక్క పేరు. ౹9 υ ౦ = 9+1+2=12 అక్షర కాలములు.
- కుల : మిశ్రజాతి రూపకతాళము యొక్క పేరు. ౦ ౹7 = 2+7=9 అక్షర కాలములు.
- కీరవాణి : 72 మేళకర్త రాగములలో 21 వ మేళకర్త రాగము.
- కాలము : తాళదశ ప్రాణములలో నొకటి. సంగీతము యొక్క నడక ప్రథమ,ద్వితీయ,తృతీయ, చతుర్థ కాలములు.
- కళ : తాళ దశ ప్రానములలో నొకటి, ఒక అక్షర కాలములో చాల చిన్న భాగము.
- క్రియ : తాళదశప్రాణము లలో నొకటి. తాళుమును ఎంచు పద్ధతి.
- కల్పిత సంగీతము : కల్పించిన రచనలు. ఉదా: కృతులు , వర్ణములు , పదములు మొదలగునవి.
- కంపిత స్వరము : ఊపబడు స్వరము.(గమకము)
- కర్త రాగము : జనకరాగమున కింకొక పేరు.
- కర్ణాటక సంగీతము : దక్షిణ హిందూ సంగీతము.
- కటకము : చిట్టతానము; రాగము ఎన్ని రకముల సంచారములతో రంజింపజేసి రాగ స్వరూపమును అఖండ తేజోవంతముగా చూపుటకు వీలగునో అన్ని సంచారములను ఇమిడ్చి తాన రూపముగా పూర్వులు వ్రాసిన రచన.
- క్రమసంపూర్ణము : ఆరోహణము, అవరోహణము క్రమముగా నుండుట, అనగా వక్రించక నుండుట.
- క్రమషాడవము : ఆరోహణమునందు ఏ స్వరము వర్జమో అవరోహణమునందున అదే స్వరము వర్జింపబడిన వర్జరాగము. ఉదా: శ్రీరంజని రాగము.
- క్రమ ఔడవరాగము : ఆరోహణమునందు ఏఏ స్వరములు వర్జింపబడినవో ఆ స్వరములే అవరోహణమునందున వర్జింపబడిన వర్జరాగము. ఉదా: మోహన రాగము.
- కాళహస్తీశ్వర పంచరత్నములు : వీణ కుప్పయ్య గారు శ్రీ కాళహస్తీశ్వరునిపై రచించిన ఐదు కృతుల సముదాయము.
సంఖ్య
|
పాట మొదలు
|
రాగము
|
తాళము
|
1
|
కొనియాడిన
|
కాంభోజి
|
ఆదితాళము
|
2
|
ననుబ్రోవరాదా
|
కాసు
|
ఆదితాళము
|
3
|
బిరాననుబ్రోవ
|
హంసధ్వని
|
ఆదితాళము
|
4
|
సామగానలోల
|
పాలగభైరవి
|
ఆదితాళము
|
5
|
సేవింతమురారమ్మ
|
శహన
|
ఆదితాళము
|
- కృతి :సంగీత రచనలలో ఇంపునూ,ముఖ్యమైన రచన. లక్షణము రచన ప్రకరణములో కాననగును. దీనిలో రాగ భావమునకు ప్రాధాన్యము.
- కీర్తన : భక్తి రచన. పల్లవి, అనుపల్లవి కొన్ని చరణములుండును. భక్తిని వ్యాపించుటకై, రచించిన రచన. సాహిత్య భావమునకే ప్రాధాన్యము. ఇతర వివరములు కృతి లక్షనములో కాననగును.
- కర్ణాటక సంగీత పితామహ :పురందరదాసుల వారి బిరుదు. వీరిని ఆది గురువనియు బిరుదు కలదు.
- కొనగోలు : జతులను నోటితో తాళబద్ధంగా ఉచ్చరించుట.
- కొవ్వూరి పంచరత్నములు: కొవ్వూరి సుందరేశ్వర స్వామిపై త్యాగయ్య రచించిన ఐదు కృతులు.
సంఖ్య
|
పాట మొదలు
|
రాగము
|
తాళము
|
1
|
నమ్మివచ్చిన
|
కల్యాణి
|
రూపకము
|
2
|
కోరిసేవింప
|
ఖరహరప్రియ
|
ఆదితాళము
|
3
|
శంభోమహదేవ
|
పంతువరాళి
|
రూపకతాళము
|
4
|
ఈ వసుధ
|
శహాన
|
ఆదితాళము
|
5
|
సుందరేశ్వరుని
|
కల్యాణి
|
ఆదితాళము
|
- కమలాంబ నవావర్ణము : ముత్తుస్వామి దేక్షితులు రచించిన తొమ్మిది కృతులు (కమలాంబ స్థుతి)
సంఖ్య
|
పాట మొదలు
|
రాగము
|
తాళము
|
1
|
కమలాంబికే
|
తోడి
|
రూపకము
|
2
|
కమలాంబాంభజరే
|
కల్యాణి
|
ఆదితాళము
|
3
|
శ్రీ కమలాంబికాయాం
|
శంకరాభరణము
|
ఆదితాళము
|
4
|
శ్రీ కమలాంబికాయై
|
కాంభోజి
|
ఆట తాళము
|
5
|
శ్రీ కమలాంబికాయాం
|
భైరవి
|
ఝంపె తాళము
|
6
|
శ్రీ కమలాంబికాయా
|
పున్నాగవరాళి
|
ఆదితాళము
|
7
|
శ్రీ కమలాంబికాయాం
|
శహన
|
త్రిపుట తాళము
|
8
|
శ్రీ కమలాంబికే
|
శ్రీ
|
ఖండఏక తాళము
|
9
|
శ్రీ కమలాంబాజయతి
|
ఆహిరి
|
త్రిశ్రఏక
|
- కరమురళి : చేతిని మురళీ లేక వేణువు వలె ఉపయోగించు మరళీ లో వచ్చు గానము వలెనె నోటి గాలితో పలికించుట.
- కోసలము : 71 వ మేళకర్త రాగము.
- కోకిలప్రియ : 11 వ మేళకర్త రాగము;
- కామవర్థిని : 51 వ మేళకర్త రాగము.
- కాంతామణి : 61 వ మేళకర్త రాగము.
- క్వచిత్ప్రయోగము : రాగమునందు ఒక స్వరమో లేక ఒక ప్రయోగమో చాలా అరుదుగా ప్రయోగింపబడునది.
- ఖరహరప్రియ : 22 వ మేళకర్తరాగం.
- ఖండము :
- వేంకట మఖి యొక్క లక్షణ గీతములలోని ఒక్కొక్క భాగమునకు ఖండమని పేరు.
- 5 అక్షరములు
- ఖండ లఘు : 5 అక్షరకాల విలువ గల లఘువు. ఒక ఘాతము నాలుగు వ్రేళ్లను ఎంచుట.
- గానకళ : సంగీత కళ
- గానసభ : సంగీత సభ లేదా కచ్చేరి
- గాంధర్వ వేదము : సంగీత వేదము; నాలుగు పపవేదములలో నొకటి; అవి ఆయుర్వేదము, ధనుర్వేదము, అర్థ శాస్త్రము , గాంధర్వ వేదము.
- గాయకుడు : పాటకుడు; నోటిపాట పాడువాడు.
- గమకము : ఊపు, ఒక స్వరమును ఎట్లు ఊచి పాడినను దానిని గమకము అందురు. గమకము మన కర్ణాటక సంగీతములో పెట్టిన వేరు. చిన్న ప్రయోగమునైనను గమకముతో పాడుట మన దేశపు పసిబిడ్డకు కూడా తెలిసిన అంశము.
- గాంధర్వ తత్వము : సంగీత శాస్త్రము.
- గతి : తాళ నడక.
- గీతము : సంగీత రచనలలో నొకటి; పల్లవి, అనుపల్లవి, చరణములను భాగములుండని రచన.
- గుప్తము : త్రిశ్రజాతి ఆట తాళము పేరు. 13 13 0 0 = 3+3+2+2 = 10 అక్షరముల విలువ.
- గురువు : షడంగములలో నొక అంగము; క్రియా విధానము - ఒక ఘాతము మరియు ముడిచిన అరచేయి గుండ్రముగా త్రిప్పుట, సశబ్ద, నిశబ్ద లఘువులు. అక్షర కాలములు ఎనిమిది. అంగ సౌంజ్ఞ 8.
- గాంధర్వ గీత : అనాది సాంప్రదాయములో వచ్చిన సంగీతము. గాన గీతము కంటే పురాతనము.
- గాంధారము : సప్త స్వరములలో మూడవ స్వరము.
- గ్రహము : ఎడుప్పు; సమగ్రహము, అనాగత గ్రహము, అతీత గ్రహములు.
- గానగీతము : వాగ్గేయకారులు రచించి మన కందించిన సంగీతము.
- గాన క్రమము : సంగీత రచన పాడవలసిన సరియగు పద్ధతి.
- గాయక ప్రియ : 13 వ జనకరాగము.
- గౌరిమనోహరి : 23 వ మేళకర్త రాగము
- గాంగేయ భూషిణి : 33 వ మేళకర్త రాగము.
- గవాంబోధి : 43 వ మేళకర్త రాగము.
- గమనశ్రమ : 53 వ కర్త రాగము.
- గోపుచ్ఛయతి : యతి ప్రాణములో నొక రకము. మొదట ఎక్కువ అక్షరాంగము కలిగి గోవు తోకవలె చివరకు తక్కువాక్షరాంగము గల యతి.
- ఘన పంచకము : పూర్వపు సాంప్రదాయ ఘన రాగములు ఐదు. అవి:నాట,గౌళ,అరభి,శ్రీరాగము,వరాళి.
- ఘాతము : చేతితో నొక దెబ్బ.
- చవుక కాలము : చాల నెమ్మదిగా నడచునది. ఒక అక్షరమునకు ఒక స్వరము పాడునది.
- చతుశృతి రిషభము : విషభమను సప్త స్వరములలో రెండవ స్వరము యొక్క రెండవ రూపము. ఫ్రీక్వెన్సీ : 9/8.
- చతుశృతి దైవతము : దైవతమను సప్త స్వరములలో ఆరవ స్వరము యొక్క రెండవ రూపము. ఫ్రీక్వెన్సీ : 27/16.
- చతురశ్ర లఘువు : నాలుగు అక్షరముల విలువ గల లఘువు; 14, క్రియా విధానము : ఒక ఘాతము, మూడు వ్రేళ్ళను ఎంచుట.
- చతుర్థ కాలము : నాల్గవ కాలము, సంకేతములో స్వరముల గుంపుపై మూడు అడ్డగీతలను గీయవలయును.
- చక్రము : త్రిశ్రజాతి రూపక తాళము యొక్క పేరు. 0 13 = 5 అక్షర కాలములు
- చక్రము : 72 మేళకర్త రాగములను పండ్రెండు భాగములుగా భాగించి, ఒక్కొక్క భాగమునకు చక్రమని శ్రీ వేంకట మఖి పేరు పెట్టినారు.
- చణ : ఖండజాతి జంపె తాళమునకు పేరు. 15 u 0 =8 అక్షరముల కాలము.
- చరణము : కర్ణాటక సంగీత రచనలలో మూడవ భాగమునకు చరణమని పేరు. వర్ణము, కృతి, పదము మొదలగు రచనలు ఉదాహరనములు
- చతుస్వర వక్రరాగము : ఆరోహణలో గాని, అవరోహణలో గాని లేక రెండింటిలో గాని నాల్గు స్వరములు వక్రముగా నుండిన యెడల ఆ రాగమునకు చతుస్వర వక్రరాగమని పేరు.
- చిట్టతానము : వీణ వాద్యము నభ్యసించువారి కొరకు రచించిన రచన. కటకమనియు దీనికి పేరు.
- చౌకవర్ణము : పదవర్ణము; పదవర్ణము యొక్క నడక చాల నెమ్మదిగాను,చౌకముగానూ ఉండటం వల్ల చౌకవర్ణమని పేరు వచ్చింది.
- చిన్న మేళము : సదిరు; దక్షిణ హిందూ దేశ నృత్యములకు ఉపయోగించు మేళము.
- చిట్టస్వరము : కృతుల చివర నుండు కొన్ని స్వరావర్తములు.
- ఛాయాలగ రాగము : ఒక రాగములో నింకొక రాగచ్చాయ కనబడు రాగము;
- చక్రవాకము : 16 వ జనక రాగము.
- చారుకేశి : 26 వ మేళకర్త రాగము.
- చలనాట : 36 వ కర్త రాగము.
- చిత్రాంబరి : 66 వ మేళకర్త రాగము.
- చాపుతాళము : సప్త తాళములు కాక వేరు తాళము. చాపు తాళములు రెండు రకములు; ఖండచాపు;మిశ్రచాపు; ఖండచాపు - 2+3= 5 అక్షరకాలములు. ఉదా: కండు కండు నీ యన్న రాగమాలిక - పురందరదాసు, మిశ్ర చాపు:3+4=7 అక్షరకాలములు. ఉదా: మనసు స్వాధీన - శంకరాభరణము - త్యాగయ్య.
- చతుర్దండి ప్రకాశిక : సంగీత గ్రంథము, శ్రీ వెంకటముఖిచే వ్రాయబడినవి.
- చిత్ర లేదా చిత్రతర లేదా చిత్రతమ : తాళదశ ప్రాణములో లయ అను ప్రానము యొక్క విధానములు; తాళదశ ప్రాణములు చూడాదగును.
- చిన్నస్వామి మొదలియార్ : ఎ.ఎం.చిన్నస్వామి మొదలియార్ గారు. మన కర్ణాటక సంగీతమును ప్రపంచమున కంతకును వ్యాప్తి చేయవలయునను అధికాభిలాషతో చాల వ్యయప్రయాసలతో మన సంగీతమును సరళీవరుల నుండి పెద్ద కృతుల వరకు ఆంగ్ల సంకేతమైన స్టాఫ్ నొటేషనులో వ్రాసి మాస పత్రికగా 1892 నుండి ప్రచురించిరి. వీరు కర్ణాటక సంగీతమునకు చేసిన కృషి అత్యద్భుతము. సత్ప తాళాలంకారములు కూడ స్టాఫ్ నొటేషనులో వ్రాసి యున్నారు.
- చాముండేశ్వరీ పంచ రత్నములు : చాముండేశ్వరీ పై వీణ కుప్పయ్య గారు రచించిన ఐదు కృతులు; భాష తెలుగు.
- జాతి : లఘువు యొక్క రకము; త్రిశ్ర జాతి 13; చతురశ్ర జాతి 14 ; ఖండజాతి 15 ; మిశ్రజాతి 17 ; సంకీర్ణ 19; తాళదశ ప్రాణములలో నొకటి.
- జంట వరుసలు : సప్త స్వరములైన తరువాత ఒక్కొక్క స్వరమును రెండుగా జంటగా నేర్పు చిన్న రచనలు. సస రిరి గగ మమ, మొదలగునవి.
- జనక రాగము : మేళకర్త రాగము; లక్షణములు: క్రమసంపూర్ణముగానూ, ఆరోహణములందు ఒకే రక స్వరములను కలదిగాను ఉండవలయును. ఉదా: ధీరశంకరాభరణము; మేచకల్యాణి.
- జన్య రాగము : జనకరాగము నుండి పుట్టిన రాగము.
- జతి : తక, తరి , కిట ,ఝం, మొదలగు తాళపదములు.
- జతిస్వరము : సంగీత రచన; ఆంధ్రదేశమున స్వరపల్లవి అనియు - అనుట కలదు. పల్లవి, అనుపల్లవి, చరణముల కలిగియుండును. సాహిత్యముండదు.
- జీవ స్వరము : అంశస్వరము; రాగచ్చాయస్వరము; రాగ స్వరూపమును చూపెట్టు స్వరము.
- జీవము : తంబూర యందు శృతి శుద్ధముగా చేసిన తరువాత నాదము చక్కగా నుండుట కొరకు ఉన్ని దారమును మెలిక తీసి బ్రిడ్జిపై ఒక్కొక్క తంతికిని "జిల్ల" ను శబ్దము వచ్చు వరకు జరుపుట ఆచారము. ఆ ఉన్ని దారమును జీవమని చెప్పుట కలదు.
- జలార్ణవము : 38 వ మేళకర్త రాగము.
- జోతిస్వరూపిణి : 68 వ మేళకర్తరాగము.
- జాలర : తాళవాద్యము
- జలతరంగము : సంగీత వాద్యము.
- ఝంకార ధ్వని : 19 వ మేళకర్త రాగము.
- ఝాలవరాళి : 39 వ మేళకర్త రాగము.
- ఝంపె తాళము : సప్తతాళములలో నాల్గవ తాళము. క్రియ: 1 లఘువు, అనుదృతము; దృతము., అంగ సంజ్ఞ : 1 U O,
- డోలు : నాగస్వరమునకు తాళవాద్యము.
- డమరు : ఒక విధమైన చిన్న తాళవాద్యము. ఈశ్వరుడుపయోగించునది.
- డమరుయతి : తాళదశ ప్రాణములలో నొకటి. ఆ యతి అంగములలో డమరుయతి ఒకటి. డమరు వలె అంగములు ఇరుప్రక్కల ఎక్కువ అక్షరములుగా గలిగి మధ్య కొద్ది అక్షరాంగములు కగ యతికి డమరు యతి అని పేరు. 8 1 O U O 1 8.
- తట్టు : ఘాతము, దెబ్బ; తాళమును చూపు సంజ్ఞలలో నొకటి.
- తాళము : సంగీతమును కొలుచు కొలత బద్ద.
- తారసప్తకము : తారస్థాయి సప్త స్వరములు.
- త్రిపుట తాళము : సప్త తాళములలో ఐదవ తాళము. 1 0 0.
- త్రిశ్ర లఘువు : మూక్షర కాలముల విలువ గల లఘువు. సంజ్ఞ 13.
- తృతీయ కాలము : మూడవ కాలము. స్వర గుంపుపై రెండు అడ్డ గీతలు వేయుట;, సంజ్ఞ : సససస
- త్రికాలము : మూడు కాలములు, ప్రథమ, ద్వితీయ, తృతీయ లేక విళంబిత, మధ్య, దృత కాలములు.
- త్రిస్వర వక్రరాగము : ఆరోహణలో గాని, అవరోహణలో గాని, లేక రెంటిలో గాని, మూడు స్వరములు వక్రములుగా నున్నచో ఆ రాగము త్రిస్వర వక్ర రాగమని పిలువబడుచున్నది.
- త్రిస్వర వర్జరాగము : స్వరాంతర రాగము. మూడు స్వరములు వర్జములు.
- త్రిశ్ర చాపు : మొదటి ఘాతమునకు ఒక అక్షర కాలమును, రెండవ ఘాతమునకు రెండక్షరములను కలిగిన చాపు తాళము.
- తారము : త్రయోదశ లక్షణములలో ఒకటి.
- తాళమాలిక : ఒకే రాగములో అంగాంగమునలు తాళము మారుచుండు రచన.
- తిరువత్తియూర్ పంచరత్నములు : తిరువత్తియూర్ లో వలసిన శ్రీ త్రిపుర సుందరిపై శ్రీ త్యాగ రాజులవారు రచించిన పంచకృతి రత్నములు.
- త్రయోదశ లక్షణములు : ప్రాచీన గ్రంథములలో రాగమునకు పేర్కొనిన పదమూడు లక్షణములు . (1) గ్రహము (2) అంశము (3) న్యాసము (4) మంద్రము (5) తారము (6) అల్పత్వ (7) బహూత్వ (8) అపన్యాస (9) విన్యాస (10) సన్యాస (11) షాడవ (12) ఔడవ (13) అంతర్మార్గములు.
- త్రిఅన్యస్వర భాషాంగ రాగము : మూడన్య స్వరముకల భాషాంగ రాగము;ఉదా: (1)హిం. కాఫీ. (2) ఆనంద భైరవి.
- త్రిపుశ్చము : స స స, రి రి రి , గ గ గ వలె ఒక స్వరము మూడు జంట గా వచ్చునది. ఉదా: భైరవి ఆట తాళ వర్ణములో మూడవ ఎత్తు గడ స్వరములో పపప ధధధ నినిని స స రి ..............
- తంబూర : శృతి వాద్యము.
- తాళము : ఘనవాద్యములలో నొకటి.
- తానరూపి : 72 మేళకర్త రాగములలో ఆరవ మేళకర్త రాగము;
- దివ్యమణి : 48 వ మేళకర్త రాగం.
- దాటుస్వరము : రెండు స్వరముల మధ్య ఒకటో లేక కొన్ని స్వరములో వర్జించునది. అనగా రిప, మద, పని మొదలగునవి. ఉదాహరణ: శంకరాభరణ ఆట తాల వర్ణము "చలమేల" పల్లవిలో రి ని - స ద - ని ప - ద మ - ప గ - మ రి - క పా ....
- దాటు వరుసలు : దాటుస్వరము.
- దాటుస్వర ప్రయోగము: రాగమును రంజింపజేయుటకు ఉపయోగించు దాటు ప్రయోగములు.
- దీర్ఘము : రెండక్షరాల కాలనుల విలువ గల స్వరము. ఉదా: సా = 2 అక్షర కాలము.
- దృతము : షడంగములలో నొకటి. క్రియావిధానము - ఒక ఘాతము, విసరు; అంగ సంజ్ఞ ; విలువ రెండక్షర కాలములు.
- దృత కాలము లేక దురిత కాలము : తొందర నడక గలది.
- ద్వితీయ కాలము : రెండవ కాలము, సంకేతములో స్వరగుంపుకై ఒక అడ్డగీతను గీయవలెను.
- ద్విస్వర వక్రరాగము: అరోహణలో కాఅని, అవరోహణలోగాని, లేక రెండింటి యందుగానీ రెండు స్వరములు వక్రములుగా నున్న రాగమునకు ద్విస్వర వక్ర రాగము అని పేరు.
- ద్విస్వర వక్ర రాగము : ఔడవ రాగము. ఉదా: మోహన.
- దుష్కర : ఖండజాతి త్రిపుట తాళము. 15 0 0 = 5+2+2=9 అక్షర కాలము.
- దిశి : 10 వ చక్రం పేరు.
- దేశి సంగీతము : ప్రస్తుత సంగీతమునకు పేరు.
- ద్వి అన్యస్వర భాషాంగ రాగము : రెండు అన్యస్వరములు కల భాషాంగ రాగము. ఉదా: హిందూస్థానీ బేహాగ్
- దైవతము : సప్త స్వరములలో ఆరవ స్వరము.
- ద్రావిడ సంగీతము : ప్రాచీన ఆరవ సంగీతము. ;సప్త స్వరములకు ఈక్రింది పేర్లు ఉపయోగింపబడినవి. (1) కురల్ (2) తుత్తం (3) కైకిళై (4) ఉషై (5) ఇళి (6) విళరి (7) తారం.
- ధృవ తాళము : సప్త తళములలో మొదటి తాళము. అంగసంజ్ఞ 1 0 1 1.
- ధీర : సంకీర్ణజాతి ఆట తాళము. 19 19 0 0 = 9+9+2+2=22 అక్షరములు.
- ధృవరూపకము : ఒక రకమైన రూపక తాళము. ఈ తాళములో రచింపబడిన యొక్క ప్రతి అంగారంభములోనూ రెండు దృతములు రెండు లఘువులు అయిన పిదప రూపక తాళాంగములు వరుసగా నుండును. ఈ రచన రూపక తాల రచనయే.
- ధేనుక : 9 వ మేళకర్త రాగము.
- ధీర శంకరాభరణము : 29 వ మేళకర్త రాగం.
- ధాతు : రచన లోని స్వర భాగములు.
- ధవళాంబరి : 49 వ మేళకర్త రాగము.
- ధర్మవతి : 59 వ మేళకర్త రాగము.
- ధాతువర్థిని : 69 వ మేళకర్త రాగము.
- నటభైరవి : 20 వ మేళకర్త రాగము
- నవనీతము : 40 వ మేళకర్త రాగము
- నామనారాయణి : 50 వ మేళకర్త రాగము
- నాశికా భూషణి : 70 వ మేళకర్త రాగము
- నాటకప్రియ : 10 వ మేళకర్త రాగము
- నాగానందిని : 30 వ మేళకర్త రాగము
- నీతిమతి : 60 వ మేళకర్త రాగము
- నిషాదము : సప్తస్వరములలో ఏడవ స్వరము.
- నాదము : సంగీత శబ్ధము; సంగీతము; వాద్యముయొక్క సునిశిత శబ్ధము.
- నీచస్థాయి : మంద్రస్థాయి.
- నిశ్శబ్ద క్రియ : శబ్దము లేని క్రియ; విసర్జితము.
- నౌబత్ : రాజనగురులలోను, మసీదులలోనూ, వాయించు మేళము పేరు.
- నవసంధితాళములు : దేవాలయ విధులలో ఉపయోగించు తొమ్మిది తాళములు.
- నవగ్రహ కీర్తనలు : ముత్తుస్వామి దీక్షితులు నవగ్రహములపైన రచించిన తొమ్మిది కీర్తనల గుచ్చము.
సంఖ్య
|
నవ గ్రహముల పేర్లు పాట మొదలు
|
రాగము
|
తాళము
|
వారము
|
1
|
సూర్యమూర్తే
|
సౌరాష్ట్ర
|
ధృవ
|
ఆది
|
2
|
చంద్రంభజ
|
ఆసావేరి
|
మఠ్య
|
సోమ
|
3
|
అంగారకం
|
సురటి
|
రూపకం
|
మంగళ
|
4
|
బుధమాశ్రయామి
|
నాటకురంజి
|
ఝంపె
|
బుధ
|
5
|
బృహస్పతే
|
ఆఠాన
|
త్రిపుట
|
గురు
|
6
|
శ్రీ శుక్రం
|
ఫరజు
|
ఆట
|
శుక్ర
|
7
|
దివాకరం
|
ఎరుకుల కాంభోజి
|
ఏక
|
శని
|
8
|
స్మరామ్యహం
|
రమామనోహరి
|
రూపకము
|
(రాహువు)
|
9
|
మహాసూరం
|
చామరం
|
రూపకం
|
(కేతువు).
|
- నవావర్ణ కీర్తనలు : దేవి స్తుతిగా రచించిన ముత్తుస్వామి గారి తొమ్మిది కీర్తనలు.
సంఖ్య
|
పాట మొదలు
|
రాగము
|
తాళము
|
1
|
కమలాంబికే
|
తోడి
|
రూపకము
|
2
|
కమలాంబాంభజరే
|
కల్యాణి
|
ఆదితాళము
|
3
|
శ్రీ కమలాంబికాయాం
|
శంకరాభరణము
|
ఆదితాళము
|
4
|
శ్రీ కమలాంబికాయై
|
కాంభోజి
|
ఆట తాళము
|
5
|
శ్రీ కమలాంబికాయాం
|
భైరవి
|
ఝంపె తాళము
|
6
|
శ్రీ కమలాంబికాయా
|
పున్నాగవరాళి
|
ఆదితాళము
|
7
|
శ్రీ కమలాంబికాయాం
|
శహన
|
త్రిపుట తాళము
|
8
|
శ్రీ కమలాంబికే
|
శ్రీ
|
ఖండఏక తాళము
|
9
|
శ్రీ కమలాంబాజయతి
|
ఆహిరి
|
త్రిశ్రఏక
|
- న్యాస స్వరము : త్రయోదశ లక్షణములలో నొకటి. కొన్ని ప్రయోగములు ఒకే స్వరముతో ముగియుట: ఉదా: మోహన వర్ణము - ఆది - నిన్ను కోరి :
- నేత్ర : 2 వ చక్రం పేరు.
- నవరత్న మాలిక : శ్రీ మధుర మీనాక్షీ దేవిపై శ్యామశాస్త్రులు రచించిన తొమ్మిది కృతుల గుచ్చము.
- నవరసములు : తొమ్మిది రసములు. అవి. శృంగారము; హాస్యం; కరుణ; రౌద్ర; వీర; భయానక; భీభత్స;అద్భుత; శాంత.
- నిరవల్ : మనోధర్మ సంగీతములో నొక రకము; కృతిలోని ఒక భాగమును గాని, లేక పల్లవి(మనోధర్మ) ని గాని పెంపొందించి సంగతుల వలె రాగ స్వరూపమును సాహిత్య భావమునూ పరిపూర్ణ స్వరూపంతో తాళబద్ధంగా పాడు దానికి నిర్రవల్ అని పేరు. "నిరవల్" ఆరవ పదము.
- నిషాందాంత్యరాగము: మంద్రస్థాయి నిషాదము క్రిందను, మధ్యస్థాయి నిషాదము పైననూ సంచారము లేని రాగము. ఉదా: నాద నామక్రియ.
- నాగస్వరము : సంగీత వాద్యము.
- పంచమము : సప్త స్వరములలో ఐదవ స్వరము
- పతకము : చేతిని ఎత్తుట
- ప్లుతము : షడంగములలో నొకటి.అంగ సంఖ్య 18.
- ప్రకృతి స్వరము : విభేదములు లేనిస్వరము : స, ప
- ప్రథమ కాలము : మొదటి కాలము.
- పతిమధ్యమము : మధ్యమము యొక్క రెండవ విభేదస్వరూపము. ఫ్రీక్వెన్సీ 45/32. తీవ్ర మధ్యమము.
- పూర్వాంగము : సప్త స్వరములలో మొదటి నాలుగు స్వరములు. స, రి, గ,మ; కర్ణము యొక్క పల్లవి. అనుపల్లవి, ముక్తాయిస్వరము.
- పూర్వ మేళములు : 72 మేళకర్త రాగములలో మొదటి 36 మేళకర్త రాగాలు.
- పల్లవి : రచన యొక్క ఆరంభ అంగము. మనోధర్మ సంగీతములో నొక తాళబద్ధమైన రచన.
- పత్తి : చురశ్ర జాతి రూపక తాళము; 0 14 = 2+4=6 అక్షర కాలము.
- ప్రబంధము : సంగీత రచన.
- ప్రమాణము : ఖండజాతి ధృవ తాళము; 15 0 15 15 = 5+2+5+5=17 అక్షర కాలము.
- పూర్ణ : మిశ్రజాతి ధృవతాళము; 17 0 17 17 =23 అక్షర కాలము.
- ప్రాసము :తాళ దశప్రాణములలో నొకటి.
- పదజతి వర్ణము : నృత్యమునందు ఉపయోగించు వర్ణ రచన. రచనారంభము నుండి అంతము వరకు సాహిత్యము కలదై, నెమ్మది నడకను కలిగినది పదవర్ణము.
- పణ్ : ప్రాచీన ఆరవ సంగీతములో రాగమునకును; రచనకును పేరు.
- పంచలింగస్థలకృతులు : ముత్తుస్వామి దీక్షితులచే రచింపబడిన ఐదు సంస్కృత కృతులు.
సంఖ్య
|
పాట మొదలు
|
రాగము
|
తాళము
|
లింగము
|
స్థలము
|
1
|
చింతమయాం
|
భైరవి
|
రూపకము
|
పృధివి
|
కంచి
|
2
|
జంబూపతే
|
యమునా కల్యాణి
|
తిశ్ర, ఏక
|
అప్పు
|
తిరువానై
|
3
|
అరుణాచలనాథం
|
సారంగ
|
తిశ్ర, ఏక
|
తేయు
|
తిరువణ్ణామలైక్కావల్
|
4
|
శ్రీ కాళహస్తీశ
|
హంసేని
|
ఝంపె
|
వాయు
|
కాళహస్తి
|
5
|
ఆనందనటన
|
కేదారం
|
మిశ్ర, ఏక
|
ఆకాశ
|
చిదంబరం
|
- పంచరత్నములు : త్యాగయ్య గారిచే రచింపబడిన ఘన రాగ కృతులు.
సంఖ్య
|
పాట మొదలు
|
రాగము
|
తాళము
|
1
|
జగదానంద
|
నాట
|
ఆది
|
2
|
దుడుకుగల
|
గౌళ
|
ఆది
|
3
|
సాధించినే
|
ఆరభి
|
ఆది
|
4
|
ఎందరో
|
శ్రీ
|
ఆది
|
5
|
కనకనరుచిరా
|
వరాళి
|
ఆది
|
- పణ్ణియం : ఆరవ సంగీతములో షాడవ రాగము.
- పాఠము : జతులు.
- పిడి వాయిద్యము : గమకము గాని, పరికము గాని లేని వాయిద్యము
- పిడిప్పు : రాగస్వరూపమును పూర్ణముగా చూపు ప్రసిద్ధ సంచారములు, రాగరంజని ప్రయోగములు. దీనినే హిందూస్థానీ సంగీతములో "పకడ్" అందురు.
- ప్రయోగము: సంచారము.
- పావని : 40 వ మేళకర్త రాగము.
- పదము : సంగీత రచన; నాయకా నాయకీ భావములో భావముతొ దేవును ధ్యానించు సాహిత్యము కలది. చాల నెమ్మదిగా నడుచు రచన. పల్లవి, అనుపల్లవి, చరణములను కలిగియుండును.
- ఫిడేలు : సంగీత వాద్యము. తంతిపై విల్లుతో వాయించునది.
- బహుత్వ : త్రయోదశ లక్షణములలో నొకటి. ఒక రాగములో తరచు ఉపయోగించు స్వరము.
- బాణ : ఐదవ చక్రము.
- బిందు : సంకీర్ణజాతి రూపక తాళము ; 0 19 ==11 అక్షర కాలము.
- బ్రహ్మ : 9 వ చక్రము పేరు.
- భయకార : వాగ్గేయకారుడు , రచయిత.
- భవప్రియ : 44 వ మేళకర్త రాగము.
- భాండీర భాష : సంస్కృతములో నొకరకము. కొన్ని ప్రాచీన గీతములు ఈ భాషలో రచింప బడినవి.
- భాషాంగ రాగము : అన్యస్వరమును కలిగిన జన్యరాగము. ఉదా: భైరవి, కాంభోజి
- భాషాంగ ఖండ : రగాంగ రాగ లక్షణ గీతములో భాషాంగ రాగముల పేర్చు గల మూడవ భాగము.
- భేదము : తేడా
- భోగ : సంకీర్ణ జాతై త్రిపుట తాళము. 19 0 0 = 13 అక్షర కాలము.
- భువన : సంకీర్ణ ధ్ర్వ తాళము 19 0 19 19 = 29 అక్షర కాలము.
- మధ్యమము : సప్తస్వరములలో నాల్గవ స్వరము.
- మానవతి : 5 వ మేళకర్త రాగము.
- మాయామాళవ గౌళ : 15 వ మేళకర్త రాగము.
- మార రంజని : 25 వ మేళకర్త రాగము.
- మేచ కల్యాణి : 65 వ మేళకర్త రాగము.
- మధ్యమ కాలము : సాధారణ నడక; మరియు తానమునకు పేరు.(మనోధర్మ సంగీతము)
- మధ్య సప్తకము : మధ్యస్థాయి సప్తస్వరములు.
- మంద్ర స్థాయి : తగ్గుస్థాయి; ఈ స్థాయి స్వరమున, స్వరము క్రింద ఒక చుక్కతో సంకేతములో చూపబడును.
- మంద్రసప్తకము : మంద్ర స్థాయిలోని సప్తస్వరములు.
- మాత్ర : 108 తాళములలోని తాళకొలత అంగము.
- మఠ్య తాళము : సప్త తాళములలో రెండవది. 1 0 1
- మిశ్ర లఘువు : ఏడక్షర కాలము విలువగల లఘువు 17
- మధ్యమ కాల సాహిత్యము : కృతి యొక్క అంగము. అనుపల్లవి చరణాంతమున ఉండును. ముత్తుస్వామి దీక్షితులు రచించిన రచనలన్నింటిలోనూ కలవు.
- మాతు : రచన యొక్క సాహిత్య భాగము.
- మనోధర్మ సంగీతము : ఆశు సంగీతము. అవి: రాల ఆలాపము, తానము, పల్లవి, కల్పస్వరము, నిరవల్.
- మిశ్ర రాగము : సంకీర్ణ రాగము
- ముక్తాయిస్వరము : తాన వర్ణములో అనుపల్లవి ననుసరించు స్వర భాగము.
- మకరిణి : రాగాలపములో ఒక భాగము.
- మధుర : చతురశ్ర జాతి ఝంపె తాలము 14 U 0 = 7 అక్షర కాలము.
- మధ్యమ వాగ్గేయకారుడు : ఒకరు రచించిన సాహిత్యమును తన స్వంత మెట్టులో కూర్చు రచయిత.
- మణి :త్రిశ్ర జాతి ధృవతాళము ; 13 0 13 13 = 11 అక్షర కాలము.
- మాతృక పదములు : అయియ, తియ్య, అయ్యిం, వయ్యం అను పదములు. యివి కొన్ని గీతములలొ కాననగును.
- మేళకర్త రాగము ( మేళ రాగము) : జనక రాగము
- మిశ్ర : ఏడు; మిశ్ర రాగము.
- యాగప్రియ : 31 వ మేళకర్త రాగము.
- యాళ్ : ఒక ప్రాచీన వాద్యము.
- యతి : తాళదశ ప్రాణములలో నొకటి.
- రిషభము : సప్త స్వరములలో రెండవది.
- రచన : సంగీత కవిత్వము
- రాగము : భావమును గానముతో ప్రవృద్ధి చేసి చూపు పద్ధతి.
- రూపక తాళము : సప్త తాళములలో మూడవది.
- రాగ : మిశ్రజాతి ఏకతాళము. 17 = 7 అక్షర కాలము.
- రాగమాలగీత : రాగమాలిక లో నుండు గీతము.
- రాగమాలిక జతిస్వరము : రాగమాలికగా నుండు జతి స్వరము.
- రాజ : ఖండజాతి రూపక తాళము. 0 15 = 7 అక్షర కాలములు
- రత : ఖండజాతి ఏకతాళము. 15 = 5 అక్షర కాలములు
- రావ : సంకీర్ణజాతి మఠ్యతాళము. 19 0 19 =20 అక్షర కాలములు.
- రాగచ్చాయస్వరము : అంశ స్వరము లేక జీవ స్వరము.
- రాగమాలిక : సంగీత రచన; తాళము ఒకటిగానే యుండి, ఒక్కొక్క భాగము ఒక్కొక్క రాగములో రచింపబడిన రచన.
- రాగమాలిక కీర్తన : కీర్తన యొక్క అంగములు వేర్వేరు రాగములతో నుండు రచన. అరుణాచల కవి రాయరు గాలి ఎనక్కు నిరుపదంనూ, జయజయ గోకుల బాల అను నారాయణతీర్థ కీర్తనలు ఉదాహరణములు.
- రాగమాలికావర్ణనము : వర్ణము యొక్క అంగములు వేర్వేరు రాగములను కలిగి యుండుట.
- రుద్ర : 11 వ చక్రము.
- రాగతాళమాలిక : ఒక్కొక్క అంగము వేర్వేరు రాగమును, తాళమును కలిగిన రచన.
- రచయిత : సంగీతమును రచించువాడు.
- రాగవర్థిని : రాగ ఆలాపన లోని రెండవ భాగము.
- రసికుడు : సంగీతామృతమును గ్రోలువాడు.
- రగణమఠ్యతాళము : ఈ తాళము క్రింది అంగములను కలిగి యుండును. గురువు,లఘువు, గురువు 8 1 8; ఒక ఆవర్తనమునకు 20 అక్షర కాలములు.
- రత్నాంగి : 2 వ మేళకర్త రాగము.
- రూపవతి : 12 వ మేళకర్త రాగము.
- రాగవర్థిని : 32 వ మేళకర్త రాగము.
- రఘుప్రియ : 42 వ మేళకర్త రాగము.
- రామప్రియ : 52 వ మేళకర్త రాగము.
- రసికప్రియ : 72 వ మేళకర్త రాగము.
- రిషభప్రియ : 62 వ మేళకర్త రాగము.
- లఘువు : షడంగములలో నొకటి. దెబ్బ + వ్రేళ్ళను ఎంచుట 1
- లయ : తాళదశ ప్రానములలో నొకటి; సంగీత నడక.
- లక్షణము : శాస్త్రము.
- లక్షణ సంగీతము : రాగము యొక్క లక్షణములను తెలుపు సాహిత్యము గల గీత రచనము.
- లక్ష్య : సంగీత రచనలు.
- లక్ష్య గీతము : సాధారణ గీతములు.
- లేఖ : చతురశ్ర జాతి ఆట తాళము; 14 14 0 0 =12 అక్షర కాలములు.
- లీల : మిశ్రజాతి త్రిపుట తాళము : 17 0 0 =11 అక్షర కాలము.
- లోయ : మిశ్రజాతి ఆట తాళము : 17 17 0 0 =18 అక్షర కాలములు.
- లౌకిక గానము : సాధారణ రచనలు.
- లతాంగి : 33 వ మేళకర్త రాగము.
- వికృత స్వరము : భేదస్వరము; శుద్ధస్వరము కానిది.
- విళంబిత కాలము : నెమ్మది నడక (కాలము)
- బిళంబిలయ : నెమ్మది లయ.
- విసర్జితము : వుసి
- వాగ్గేయకారుడు : రచయిత.
- వాదిస్వరము : రాగములలో ప్రసిద్ధమైన స్వరము.
- వైదీక గానము : స్థుతి గానము; సంపూర్ణముగా దైవస్తుతీ గానము.
- వరిక : కంపితము; గమకములొ నొక విధము.
- వర్ణము : గానము చేయు పద్ధతి మరియు సంగీత రచన.పల్లవి, అనుపల్లవి, ముక్తాయిస్వరము, చరణము చరణస్వరములను కలిగి యుండును. రచన ప్రకరణము చూడదగును.
- వసు : 8 వ చక్రము.
- వేద : 4 వ చక్రము
- వేంకటేశ పంచ రత్నములు : వీణ కుప్పయ్య గారు రచించిన 5 కృతులు.
సంఖ్య
|
పాట మొదలు
|
రాగము
|
తాళము
|
1
|
మమ్ము బ్రోచుపట్ల
|
సింహేంద్ర మధ్యమము
|
ఆది
|
2
|
నన్నుబ్రోవ
|
మఖార
|
ఆది
|
3
|
సరోజాక్ష
|
సావేరి
|
ఆది
|
4
|
నీవే దిక్కని
|
దర్బారు
|
ఆది
|
5
|
బాగుమీరగను
|
శంకరాభరణము
|
రూపకము.
|
- విజయ రాఘవ పంచరత్నములు : తంజావూరు విజయరాఘవ నాయకుపై క్షేత్రయ్య రచించిన 5 పదములు.
- విలోమక్రమ : వికటకవి క్రమము.
- విన్యాస : త్రయోదశ లక్షణములలో నొకటి.
- విరామ : అనుదృతము.
- విశేషసంచారము : రాగములో రంజకము కొరకు చాల మితముగా వాడబడు సంచారము.
- విశ్రాంతి : రచనలో కొంత వరకు విశ్రాంతి యుండుట.
- వివాది స్వరము : రెండు స్వరముల మధ్య ఒక్క శృతి మాత్రము భేదముండిన యెడల ఆ రెండు స్వరములు ఒకదాని నొకటి వివాది అనబడును. వివాది స్వరము, శత్రు స్వరము, హిందూస్థానీ సంగీతములో వర్జస్వరమును వివాది స్వరమనుట వాడుక.
- వుసి : విసర్జితము.
- వక్ర : వంకర టింకర.
- వక్ర రాగము : ఆరోహణమో, అవరోహణమో లేక రెండు వక్రముగా (వంకర టింకర) నుండు రాగము.
- వక్రాంత్యస్వరము : వక్రము ఏ స్వరముతో ఒక రాగములో ముగియునో ఆ స్వరము వక్రాంత్య స్వరమనబడును.
- వక్ర సంపూర్ణరాగము : సంపూర్ణ రాగము వక్రముగా నుండుట. ఉదా: శహాన.
- వక్ర సంచారము : సంచారము వక్రముగా నుండుట.
- వక్ర స్వరము : ఏ స్వరము యొద్ద వక్రము యేర్పడునో ఆ స్వరమునకు వక్ర స్వరమని వేరు. ఉదా: స రి గ మ ప మ ప ద ని సా. "మ" వక్ర స్వరము.
- వక్రత్వము : వక్రగుణము.
- వర్జరాగము : ఆరోహణములోగాని, అవరోహణములోగానీ, లేక రెంటిలో గాని, ఒకటి, రెండు, మూడు, స్వరములు వర్జింపబడిన రాగము వర్జ రాగము.
- వర్జస్వరము : వర్జింపబడిన స్వరము, ఉదా: మధ్యమావతీలో గాంధారమును, దైవతమును వర్జ స్వరములు.
- వర్జత్వము : వర్జగుణము.
- వసు : సంకీర్ణజాతి ఏక తాళము ; 19 = 9 అక్షర కాలము.
- విదళ : ఖండజాతి ఆట 15 15 0 0 =14 అక్షర కాలములు.
- వనస్పతి : 4 వ మేళకర్త రాగము.
- వకుళాభరణము : 14 వ మేళకర్త రాగము.
- వరుణప్రియ : 24 వ మేళకర్త రాగము.
- వాగధీశ్వరి : 34 వ మేళకర్త రాగము.
- వాచస్పతి : 64 వ మేళకర్త రాగము.
- విశ్వంభరి : 54 వ మేళకర్త రాగము.
- శాలిని: 35 వ మేళకర్త రాగము.
- శుభపంతురవాళి : 45 వ మేళకర్త రాగము.
- శ్యామలాంగి : 55 వ మేళకర్త రాగము.
- శుద్ధ స్వరము : విభేద స్వరములలో మొదటి స్వరము; ఉదా: శుద్ధ రిషభము.
- శూళాది : తాళమాలిక లాంటి రచన.
- శృతి : ఆధార షడ్జమము.
- శుద్ధ రిషభము : రిషభములో మొదటి భేదస్వరము.
- శుద్ధ మధ్యమము : మధ్యమ స్వరములో మొదటి భేదస్వరము. కోమల మధ్యమము.
- శుద్ధ దైవతము : కోమల దైవతము.
- శుద్ధ గాంధారము : చతుశృతి రిషభము.
- శుద్ధ నిషాదము : చతుశృతి దైవతము.
- శంఖ : త్రిశ్రజాతి త్రిపుట తాళము. 13 0 0 = 7 అక్షర కాలములు.
- శతరాగ రత్న మాలిక : త్యాగయ్య రచించిన 100 రాగములలో100 కృతులు.
- శుద్ధ రాగము : వేరె రాగము యొక్క ఛాయ కనబడని రాగము.
- షడ్విధమార్గిణి : 46 వ మేళకర్త రాగము.
- షణ్ముఖప్రియ : 56 వ మేళకర్త రాగము.
- షడ్జమము : సప్త స్వరములలో మొదటి స్వరము.
- షడంగములు : తాళము యొక్క ఆరు అంగములు.
|
|
|
|
1
|
అనుదృతము
|
U
|
1 దెబ్బ, 1 అక్షర కాలము
|
2
|
దృతము
|
౦
|
1 దెబ్బ, విజర్జితము 2 అక్షర కాలములు
|
3
|
లఘువు
|
౹
|
1 దెబ్బ, వ్రేళ్ళు
|
4
|
గురువు
|
8
|
1 దెబ్బ, 7 వ్రేళ్ళు
|
5
|
ప్లుతము
|
18
|
1 దెబ్బ,1 కృష్య,1 సర్పిణి
|
6
|
కాకపాదము
|
+
|
1 దెబ్బ,1 పతకం, 1 కృష్య, 1 సర్పిణి
|
- షట్శృతి రిషభము : సాధారణ గాంధారము.
- షట్శృతి దైవతము : కైసికి నిషాదము.
- షాడవము : త్రయోదశ లక్షనములలో నొకటి.
- షాడవరాగము : ఆరోహణలోను, అవరోహణలోను ఆరు స్వరములు గల రాగము; అనగా ఒక స్వరము లోపించుట; ఉదా:- శ్రీరంజని:
- షాడవ ఔడవ రాగము : ఆరోహనములో 6 స్వరములు అవరోహణములో 5 స్వరములు కల రాగము. ఉదా: హిటకురంజి.
- షాడవ సంపూర్ణరాగము : ఆరోహణములో 6 స్వరములు అవరోహణములో సంపూర్ణముగా నుండు రాగము. ఉదా: కాంభోజి.
- షాడవ స్వరాంతర రాగము : ఆరోహణములో 6 స్వరములు అవరోహణములో 4 స్వరములు కల రాగము.
- షోడశాంగములు : తాళము యొక్క 16 అంగములు
- సేనావతి : 7 వ మేళకర్త రాగము.
- సూర్యకాంతము : 17 వ మేళకర్త రాగము.
- సరసాంగి : 27 వ మేళకర్త రాగము.
- సాలగము : 37 వ మేళకర్త రాగము.
- సువర్ణాంగి : 47 వ మేళకర్త రాగము.
- సింహేంద్రమధ్యమము : 57 వ మేళకర్త రాగము.
- సుచరిత్రము : 67 వ మేళకర్త రాగము.
- సాధారణ గాంధారము : కోమల గాంధారము; గాంధారము యొక్క మొదటి రూపము.
- సాహిత్యము : మాతు; భాషాభాగము.
- సంగతి : సాహిత్య భావ ప్రవృద్ధి.
- సంకీర్ణలఘువు :తొమ్మిదక్షరముల విలువగల లఘువు . 19.
- సప్త : ఏడు.
- సప్తకము : సప్త స్వరములు.
- సప్తస్వరములు : షడ్జ,రిషభ,గాంధార,మధ్యమ,పంచమ,దైవత,నిషాద స్వరములు.
- సప్త తాళములు : 7 తాళములు; ధృవ, మఠ్య,రూపక,ఝంపె,త్రిపుత,ఆట,ఏక తాళములు.
- సర్పిణి : కుడిప్రక్కకు చేతిని వూపుట.
- సశబ్దక్రియ : శబ్దము తో కూడిన క్రియ; ఘాతము.
- స్థాయి : అనుమంద్ర, మంద్ర,మధ్య, తార,అతి తార స్థాయిలు, స్థానము, సప్తకము.
- స్వరము : సంగీతాక్షరము.
- స్వర జ్ఞానము : పాడిన రాగమును స్వరపరచగలుగుట, వ్రాసిన రాగమును పాడగలుగుటయు స్వర జ్ఞానమనబడును.
- స్వరావళి : సంగీత కళను అభ్యసించునపుడు ప్రప్రధమమున నేర్చుకొను పునాది శిక్షా పాఠము.
- సాధారణ గీతము : సంచారి గీతము.
- సమ : చతురశ్ర జాతి మఠ్య తాళమునకు పేరు. గుర్తు 14 0 14 = 10 అక్షరములు. 108 తాళములలో నొకదాని పేరు గుర్తు. 14 14 0 U 0 = 13 అక్షరములు
- సంపూర్ణ రాగము : ఆరోహణము నందును అవరోహణమునందును సప్త స్వరములు గల రాగము; ఉదా: ఖరహరప్రియ.
- సంపూర్ణ ఔడవ రాగము : ఆరోహణమునందు సప్తస్వరములు , అవరోహణమునందు అయిదు స్వరములు కలిగిన రాగము. ఉదా: గరుడధ్వని.
- సంపూర్ణ సంపూర్ణ రాగము: లేక సంపూర్ణ రాగము. ఆరోహణమునందు, అవరోహణము నందు సప్త స్వరములు గల రాగము. ఉదా: భైరవి.
- సంపూర్ణ స్వరాంతర రాగము : ఆరోహణమునందు సప్తస్వరములు గలిగి అవరోహణము నందు నాలుగు స్వరములు గల రాగము.
- సంచారము : ప్రయోగము; పిడిప్పు; రాగస్వరూపమును కొద్దిలో భావము వచ్చునటుల స్వరముతో వ్రాయు పద్ధతి.
- సంచారి : రాగమును పాడునపుడు రాగ స్వరూపము చూపు ప్రయోగము.రాగ వర్నములలో నొకటి. ఈ స్వరమునకు తాళము కూర్చబడును.
- స్వకీయ స్వరము : భాషాంగ రాగములో అన్య స్వరమును దాని యొక్క విభేద స్వరమును ఉండును. అపుడు ఆ రాగము యొక్క మేళకర్త స్వరమును "స్వకీయ స్వరమని" యు, భేద స్వరమునకు "అన్యస్వరమని"యు పేరు. ఉదా: కాంభోజి లో కైసికి నిషాదమును, కాకలి నిషాదమును కలవు.కైసికి నిషాదము, తన మేళకర్తయగు హరి కాంభోజి స్వరమే, కనుక ఇది "స్వకీయ స్వరము". కాకలి నిషాదము కాంభోజికి క్రొత్త అలంకారము నిచ్చు స్వరము. కనుక ఇది ఆన్య స్వరము.
- స్వరజతి : పల్లవి, అనుపల్లవి, చరణము, లేక చరణములు కలిగిన రచన.చరణములు వేర్వేరు ధాతువులతో నుండును. వర్ణముల కు ముందు నేర్పబడునది.
- సంచారి గీతము : సామాన్య గీతము లేక లక్ష్యగీతమని వేరే పేర్చు. దీని సాహిత్యము భగవస్తుతి గలదై యుండును.
- సంకీర్ణ : సంకీర్ణ రాగము , తొమ్మిది.
- సార : త్రిశ్ర జాతి మఠ్యతాళమునకు పేరు. అంగ సంజ్ఞ 13 0 13 = 8 అక్షరములు.
- సూళాది : సప్త తాళమునకు సూళాది తాళములని పేరు.
- సూర : మిశ్ర జాతి ఝంపె తాళమునకు పేరు. అంగ సంజ్ఞ 17 U 0 = 10 అక్షరములు.
- స్వకీయ స్వరము : భాషాంగ రాగములో 1,2 లేక 4 అన్య స్వరములు వచ్చును. జనక రాగమునకు సంబంధించిన స్వరము స్వకీయ స్వరమనియు జనక రాగ స్వరములకు సంబంధము లేనివి అన్యస్వరములనియు పేర్లు.
- స్వరాంతర ఔడవరాగము : ఆరోహణము నందు నాలుగు స్వరములను అవరోహణ యందు అయిదు స్వరములు గల రాగము;
- స్వరాంతర రాగము : ఆరోహణము నందు నాలుగు స్వరములును, అవరోహనమునందు కూడ నాలుగు స్వరములుగా కలిగిన రాగము.
- స్వరాంతర సంపూర్ణ రాగము : ఆరోహణము యందు నాలుగు స్వరములును, అవరోహణముయందు సప్త స్వరములును కలిగిన రాగము.
- స్వరాంతర షాడవ రాగము :ఆరోహణయందున నాలుగు స్వరములను, అవరోహణమునందు ఆరు స్వరములును గల రాగము.
- స్వరాంతర స్వరాంతర రాగము : ఆరోహణము యందును, అవరోహణము యందును నాలుగు నాలుగు స్వరములుగా గల రాగము.
- స్వర పల్లవి : జతి స్వరము.
- స్వర స్థానము : స్వరము యొక్క ఉనికి;
- స్వర రూపము : రాగము యొక్క పరిపూర్ణ ఛాయ.
- సాలగ రాగము : ఛాయాలగ రాగము.
- సాలంక రాగము : ఛాయాలగ రాగము.
- సమగ్రహము : పాటయును తాళమును ఒకేసారి ప్రారంభించబడే చోటు.
- సంవాది : రెండు స్వరముల మధ్య 8,12 శృతులున్న యెడల ఆ రెందు స్వరములు సంవాది స్వరములు; సంవాది స్వరము రాజునకు మంత్రిలాంటిది. షడ్జమము పంచమము లేక షడ్జమము సంవాది స్వరములు.
- సంకీర్ణ రాగము : వేరు వేరు రాగముల ఛాయను కలిగిన రాగము; కలగా పులగ రాగము.
- సంక్రమ రాగము : సంకీర్ణ రాగము.
- సన్యాసము : త్రయోదశ లక్షణములలో నొకటి.
- సర్వలఘు : తాళాంగములు వేరువేరుగా చూపక అక్షర కాలముతో ఒకె విధముగా నెంచుట.
- సొల్కట్టు : జతులు, తాళశబ్దములు.
- సొల్కట్టు స్వరము : కొన్ని కృతులకుండు జతులతో అల్లిన చిట్ట స్వరములు. అనుపల్లవి అంత మందు చిట్టస్వరము యొక్కస్వరభాగమును, చరణాంతమందు జతుల భాగమును పాడుట ఆచారము.
- సూత్రఖండ : రాగాంగ రాగ లక్షణ గీతము యొక్క మొదటి భగము.
- స్వరాక్షరము : స్వరభాగములోను సాహిత్య భాగములోను ఒకే అక్షరముందు అలంకారము. కొన్ని వర్ణములలోను, కృతులలోను, పదములలోను,జావళీలలోనూ కాననగును.
- స్వర సాహిత్యము : కొన్ని కృతుల చిట్ట స్వరములకు సాహిత్యములు కూడ రచింపబడి యుండును. సాహిత్య భాగము చరణాంతమున పాడుట అలవాటు. కృతికి అత్యంత శోభనిచ్చును.
- స్వయంభూస్వరము : ఒక స్వరము యొక్క పై స్థాయిలోని సరి స్వరము.
- సర్వస్వరగమకవరిక రాగము : ఒక రాగములో అన్ని స్వరములను గమకముతోటి, వరికముతోటి పాడగల రాగము.
- హనుమతోడి : 8 వ మేళకర్త రాగము.
- హాట కాంబరి : 18 వ మేళకర్త రాగము.
- హరికాంభోజి : 28 వ మేళకర్త రాగము.
- హేమవతి : 58 వ మేళకర్త రాగము.
- హెచ్చుస్థాయి: తారస్థాయి.
- హెచ్చుస్థాయి వరుసలు : తారస్థాయి స్వరముల నుపయోగించి వ్రాయబడిన స్వరవరుసలు.
- హ్రస్వము : పొట్టిది; పొడి; దీని పరిమాణము ఒక అక్షర కాలము.
- హిందూస్థాని సంగీతం : ఉత్తర హిందూస్థానము నందు పాడబడు సంగీతము.