యాస కవితా సంకలనం

మూస:యాస కవితా సంకలనం

యాస కవితా సంకలనం

ఇందులో జాతీయస్థాయిలో యాసను ప్రేమించే 84 మంది కవులు యాస గొప్పదనాన్ని వివరిస్తూ కవిత్వాన్ని రాశారు.“యాసంటే కమ్మనైన అమ్మ...., విచ్చుకున్న ముద్దబంతి, విరబూసిన తంగేడు, పల్లెటూరి పిల్లగాడు, సెలయేటిపై వీచే పిల్లగాలి, కాళోజి కవిత, గోరేటి పాట..” అంటూ “యాస” కవితలో డా. తండు కృష్ణకౌండిన్య యాసకు పట్టుకొమ్మను చెప్పాడు. ఇత్తనం గంప” కవితలో చిట్ల ప్రేమ కుమార్ “ఎల్తురు పిట్ట తూర్పు సెట్టు మీద వాలక మునుపే సీపుర్ల ఏక్తారా మోగేది...”అంటూ యాస పరిమళాన్ని అక్షరాలలో పొదిగారు. వేముల ఎల్లయ్య “తెల్గం తెలంగ” కవితలో “ తొవ్వ జరుగు జాడలో వినికిడి సైగ సంకేతం... చేతి వెన్నె ముద్ద తొలి తెలంగాణ బాస కుప్పె” అని భాషాభిమానం ప్రకటించాడు.” ప్రసిద్ద కవి వేణుసంకోజు రాసిన “ఈ నేలే మహాబలి” కవితలో “రాతి యుగాలను మూగతనాలను సైగల కాలాలను గడిపిన యాతనల నుండి ....ఈ నేల అనన్య అభినవ సామాన్యుడు నిరంతర పరిశ్రమజీవియే” అంటాడు. సాగర్ల సత్తయ్య రాసిన కవిత “నెనరు”లో “ఎన్కటి నుంచి గూడా తెలంగాణ గడ్డది మాట ముచ్చట్లల్ల, పెట్టి పోతల్లల పావురం గల్ల కన్నతల్లి నెనరు” అంటాడు. “యాడుంది” కవితలో “నా అధికారిక యాసింకా గొంగళి దశలోనే ఉంది” అంటాడు చిత్తలూరి సత్యనారాయణ.

మదిర సిద్దన్న “యాసగోస” కవితలో “యాసంటే చిన్నతనం గాడు, యాసంటే తెలంగాణ భాషామృతం” అంటాడు. పున్న దామోదర్ రాసిన కవిత “చైతన్య జ్వాల” కవితలో “గ్రాన్దీక పొరల మాటున ప్రామాణిక పాదం చీల్చి, ఉవ్వెత్తున ఎగసిన కెరటం గాదె యాస” అంటాడు. “మన భాష- మన యాస” సహస్రపేజీల పదకోశాన్ని వెలువరించిన ఆదిలాబాద్ కవి కీ.శే. మడిపల్లి భద్రయ్య కవిత “ఇగ మీ ఇష్టం” లో “ఓ.. మా రాజ్జం మాకచ్చిందని ఎగిర్నం, దుంకినం, అయ్పాయే. అన్ములొడ్సినై, ఇంకేమో ఒడ్సినట్ల, లొటపెట పద్యాలకెర్జూసినట్లైపాయె, బత్కు థూ...” అంటూ తన అసంతృప్తిని బాహాటంగా చెప్పాడు. “యాది” శీర్షికతో కవిత రాసిన శీలం భద్రయ్య “ఆకిలూడ్సేటపుడు అమ్మ చేతిలో యాస, జోడెద్దుల మెడలో కట్టిన గంటల పల్లవి యాస,శ్రామిక గళాల మధురగానాలు యాస” అంటూ పల్లె నేటివిటి యాసను పలికించాడు. ఇదే కవితలో పెత్తందార్ల, వలస వాదుల ఇనుపపాదాల కింద నలిగిపోయిన “రాయబడని కవుల సిరాలో యాసను” పేర్కొన్నాడు.

”బంధాల మర్సి రందిల తిరుగుతున్నం” అంటూ బాధల జీవితాలను వెలిశాల నాగమోహన్ “ఇంపైన బాల్యపు యాస”లో రాశాడు. “జానపదములందు జాలువారెడి యాస” అంటూ ఊట ఖండకావ్య పద్యకవి డా. లింగనబోయిన లేఖానందస్వామి యాసలోని గొప్పదనాన్ని ఆటవెలదుల కవిత్వంగా రాశాడు. ఆచార్య యం.రామనాథం నాయుడు మైసూరు నుండి “తెలంగాణ ఉద్యమం-యాస” గొప్పదనాన్ని కవిత్వంలో స్మరించాడు.”మూగబోయిన గొంతునడుగు మాటకు మించిన రాగం ఏంటో” అని యాస తొక్కిన గొంతులను అడిగితే ఆ బాధ తెలుస్తుందని శ్రీమతి పాలడుగు సరోజినీ దేవి తన కవిత ”మాధుర్యం”లో చెబుతుంది. మాదగాని శంకరయ్య రాసిన కవిత “అమ్మ”లో “తల్లి వేరును తనివితీరా తడిమిచూడు” అని యాస మర్సిన బతుకులకు యాస తత్వాన్ని చెబుతాడు. “మన యాసే మన బతుకు, మన యాసే మన సంస్కృతి” అంటూ డా. వి. జయప్రకాశ్ “ఆత్మన్యూనత వదులుకుందాం” అనే కవితలో యాసగొప్పదనాన్ని చెబుతాడు. ఇలా ఈ పుస్తకంలో యాస గొప్పదనాన్ని 84 మంది కవులు తమదైన గొంతుతో బలంగా విన్పించారు.

ఇతర లింకులు: <small>మార్చు</small>